Saturday, 15 March 2014

Puri Rath Yatra

పూరీ క్షేత్ర చరిత్ర:--
ఇంద్రద్యుమ్న మహారాజు గొప్ప దైవ భక్తుడు. నీలాచలం అనే పర్వతం మీద జగన్నాథ స్వామి సుభద్రా బలరాముల తోడి వెలసి యున్నాడని బ్రాహ్మణుల ద్వారా తెలుసుకున్న ఆయన వారిని దర్శించడానికి అక్కడికి వెళతాడు. జగన్నాథుడు ఆయన భక్తిని పరీక్షించాలని అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. రాజు నిరాశతో అక్కడి నుంచి వెనుదిరిగి స్వామి దర్శనం కోసం పరితపిస్తుంటాడు. ఒక రోజు కలలో రాజుకు జగన్నాథుడు కనిపించి సముద్రపు అలల్లో రెండు కొయ్య దుంగలు ఒడ్డుకు కొట్టుకు వస్తాయనీ వాటి నుంచి తమ విగ్రహాలను చెక్కించమని కోరాడు.


అలా కొట్టుకువచ్చిన కొయ్యలను రాజు వెలికితీసి రాజ్యం లోకి తీసుకెళ్ళగానే సాక్షాత్తూ విశ్వకర్మ యే శిల్పి రూపమున వచ్చి తాను ఆ దారువులలో దేవతా మూర్తులను చెక్కెదనని అభయమిచ్చాడు. కానీ ఆయన ఒక నియమం పెట్టాడు. ఆయన చెప్పేవరకూ ఎవరూ ద్వారములు తెరువ కూడదని కోరాడు.దాని ప్రకారం ఆయన ఒక గదిలో చేరి తలుపులు బిగించి శిల్పాలు చెక్కుతాడు. పని ప్రారంభించి పది రోజులైంది.


ఒక రోజు రాజమాత లోపల యున్న శిల్పి పది రోజులుగా భోజనం లేకుండా ఉంటాడని భావించి తలుపులు తెరవమన్నది. తల్లి మాట కాదనలేని రాజు అలాగే తలుపులు తెరిపించాడు. కానీ అక్కడి శిల్పి అదృశ్యమయ్యాడు. అప్పటికే చేతులూ, కాళ్ళు తప్ప మిగతా భాగాలన్నీ పూర్తయ్యాయి. అసంపూర్తిగా ఉన్న విగ్రహాలను ఏమిచేయాలో రాజుకు తోచలేదు. వాటిని అలాగే ప్రతిష్టించాలను దైవవాణి ఆజ్ఞాపించడంతో విగ్రహాలను అలాగే ప్రతిష్టించారు.

రథయాత్ర:--

ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది, భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర. ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జులై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లో ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి.దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ యాత్ర పూరీ నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది.

No comments:

Post a Comment