Saturday 1 February 2014

Mangalagiri Temple Information

మంగళగిరి పానకాల నరసింహ స్వామి(క్షేత్ర మహత్యం) :
 
మంగళగిరి గుంటూరు జిల్లాలో ఉన్నది. గుంటూరు - విజయవాడ జాతీయ రహదారి పై గుంటూరుకు 20 కి.మీ దూరంలో ఉన్న ఈ చారిత్రక పట్టణములో ప్రసిద్ధి చెందిన, పురాతనమైన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉన్నది. మంగళగిరి అనగానే పానకాల స్వామి స్ఫురణకు వస్తాడు.
 

లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం :

ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వాస్తవంగా రెండు దేవాలయాల కింద లెక్క. కొండ కింద ఉన్న దేవుడి పేరు లక్ష్మీనరసింహ స్వామి. కొండ పైన ఉన్న దేవుడిని పానకాల స్వామి అని అంటారు. కొండ పైని దేవాలయంలో విగ్రహమేమీ ఉండదు; కేవలం తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరచుకొని ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం.మంగళగిరి పానకాలస్వామి కి ఒక ప్రత్యేకత ఉంది. పానకాలస్వామికి పానకం (బెల్లం, పంచదార, చెరకు) అభిషేకం చేస్తే, అభిషేకం చేసిన పానకంలో సగం పానకాన్ని స్వామి త్రాగి, మిగిలిన సగాన్ని మనకు ప్రసాదం గా వదిలిపెడతాడుట. ఎంత పానకం అభిషేకించినా, అందులో సగమే త్రాగి, మిగిలిన సగాన్ని భక్తులకు వదలడం ఇక్కడ విశేషం. అందుకనే స్వామిని పానకాలస్వామి అని పిలుస్తారు.

 

శ్రీమన్నారాయణుడు స్వయంభూగా అవతరించిన పుణ్యక్షేత్రాలు ఎనిమిది. శ్రీరంగం, శ్రీ ముష్ణం, నైమిశారణ్యం, పుష్కరం, సాలిగ్రామం, దోదాద్రి, భద్రికామ్రం, వెంకటాద్రి. ఇందులో దోదాద్రి ఎంతో పవిత్రమైన మంగళగిరి పేరుతో పిలువబడుతుంది. ఇక్కడ స్వామి స్వయంభూవుగా అవతరించిన వైనం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కృతయుగం కాలంలో........ పరియత్రుడు అనే రాజుకు హ్రస్వశ్రుంగి అనే పుత్రుడు జింకరూపంతో ఉండేవాడు. తన జింకరూపం మారి మామూలు మనిషి రూపం దాల్చటానికి అతడు దోదాద్రిలో తపస్సు చేసాడు.

అతని తపస్సుకి సంతసించిన ఇంద్రుడు ప్రత్యక్షమై నీవు నారాయణుని ధ్యానించి కఠిన తపస్సు చెయ్యు.... నారాయణుడు నీవు కోరిన వరాన్ని ప్రసాదించగలడు. అని ఆశీర్వదించి అద్రుశ్యమయ్యినాడు.

దోదాద్రి పై తపస్సుచేస్తున్న పుత్రుడిని తీసుకెళ్ళి, సింహాసనముపై కూర్చుండబెట్టి, పట్టాభిషేకము చెయ్యాలని నిర్ణయించుకొన్న పరియత్రుడు అక్కడికి వెళ్ళాడు.

రాజ్యానికి తిరిగి వెళితే నారాయణుడు ఆశీర్వాదము తనకు లభించదు భయంతో హ్రాస్వశ్రుంగి ఏనుగు రూపం లో ఉన్న ఒక కొండగా మారాడు. ఎటువైపునుండి చూసినా నేటికీ ఆ కొండ ఏనుగు రూపంలో కనిపిస్తుంది.

ఇది ఇలా ఉండగా నముచి అనే అసురుడు బ్రహ్మదేవుని కోసం కఠిన తపస్సు చేసాడు. అతని తపస్సుకి మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. నముచి "తడిగా ఉన్న ఏ వస్తువుతో కానీ, ఎండిపోయి రాలిపోయిన ఏ వస్తువుతో కానీ, నాకు మృత్యువు వాటిల్లకూడదు" అని అడుగగా బ్రహ్మ తథాస్తు అని అన్నాడు.

మంగళగిరి శ్రీ లక్ష్మి నృసింహస్వామి వారికి తంజావూరు మహారాజు బహుకరించిన దక్షినావ్రుత శంఖు

నముచి తన వర ప్రభావంతో దేవతలని నానా బాధలు కలుగ జేశాడు. ఇంద్రుడు నారాయుని వద్దకు వెళ్ళి, నుముచి నుండి అన్యాయములను అంతమొందించమని వేడుకొన్నాడు. వెంటనే నారాయణుడు ఇంద్రునకు తన చక్రం ఇచ్చి నుముచి పై దండెత్తమని చెప్పాడు. ఇంద్రుడు తన సైన్యంతో నముచి యొక్క సైన్యాన్ని పై దండెత్త సాగాడు. నముచి.... బ్రహ్మా ఇచ్చిన వరాలని రక్షక కవచంగా భావించి, దొదాద్రి కొండపై, ఒక గుహలో తన దేహాన్ని వదిలి ఆత్మ రూపంలో ఉన్నాడు .


ఇంద్రుడు సుదర్శన చక్రాన్ని సముద్రపు నీటిలో--నురగలో ముంచి తీసాడు.అది తడి కాకుండా, ఎండినట్లు కాకుండా ఉన్న చక్రాన్ని దోదాద్రి వైపు విసిరాడు. సుదర్శన చక్ర రూపంలో ఉన్న నారాయణుడు.... ఉగ్రనరసింహ రూపునిగా ఆ దుష్టుని సంహరించాడు. నముచి సంహారము తరవాత కూడా నరసింహ స్వామి ఉగ్రరూపం శాంతించలేదు. అందుచేత ఇంద్రాది దేవతలు, నరసింహస్వామిని.... అమృతాన్ని సేవించమని కోరారు. అమృతం సేవించిన తరవాత, నారసింహని రౌద్రం శాంతించింది. ----కనుక త్రేతాయుగంలో---నెయ్యి, ద్వాపరయుగంలో---పాలు, కలియుగంలో----పానకం తాగి తాను శాంతిస్తానని స్వామి చెప్పారు.

హ్రస్వసృంగి సదా నారాయణుని ధ్యానించి, ఇక్కడే అవతరించమని వేడుకొనగా, నారాయణుడు ఈ పర్వతం మీదనే వెలసినాడు. లక్ష్మీదేవి కూడా ఇక్కడే అవతరించటం వల్ల ఈ (ప్రాంతాన్ని) క్షేత్రాన్ని "మంగళగిరి" అని అంటారు.

గర్భగుడిలో స్వయంభూమూర్తి 15 cm వరకు, నోరు తెరిచినట్లుగా ఉన్న నరసింహ స్వామి దర్శనం మహదానందాన్ని కలిగిస్తుంది. శంఖంతో స్వామికి పానకాన్ని సమర్పించినప్పుడు, మనం నీరు తాగేటప్పుడు వచ్చే శబ్దం వలె మనకు వినిపిస్తుంది. పానకం లోపలి వెళ్ళేటప్పుడు శబ్దం ఎక్కువై , తదుపరి నిశ్శబ్దమైపోతుంది. తరవాత స్వామివారి నోట పానకం చూడగలం. ఆ పానకమే తీర్థముగా అందరికీ పంచిపెడతారు. పానకము ఆలయములో ఉన్నాగానీ..... చీమ , ఈగ... ఏవీ కూడా మనకు కనిపించవు.

రాత్రిపూట స్వామిని పూజించుటకు దేవతలు వస్తారని.... పురాణాలు పేర్కొంటున్నాయి. అందుచే భక్తులకు పగటిపూట మాత్రమే ఆలయంలోకి వెళ్ళే అనుమతి లభిస్తుంది.

ఈ స్వామిని దర్శిస్తే అనారోగ్యాలు తగ్గి, ఆరోగ్యవంతులు అవుతారు. కోరిన కోర్కెలు సిద్ధిస్తాయి. మంగళగిరి పానకాల నరసింహస్వామి వారి కృప అందరికి కలుగును గాక.

No comments:

Post a Comment