Monday 6 August 2012

Scientific Verification of Vedic Knowledge


Scientific Verification of Vedic Knowledge


శ్రీ గురుభ్యో నమః

నమస్కారం,

వేదములు ఎంతో సనాతనమైనవి. ఈ విషయం అందరికీ తెలిసినదే..కానీ కొద్ది మంది అవైదిక సాంప్రదాయముల వాళ్ళు, ఇక్కడే మన దేశంలోనే పుట్టీ, ఇక్కడ గాలీ, నీరూ ఆహారం సేవించి కూడా, మన దగ్గరేముంది? ఇప్పుడు మనకి కబడుతున్న వైజ్ఞానిక ప్రగతి అంతా తెల్లవాడి భిక్ష అని అజ్ఞానంతో కొట్టుమిట్టాడే వారికి, ఒక కనువిప్పు కలిగించే అద్భుతమైన వీడియో ఇక్కడ జతచేస్తున్నాను. బహుశా ఇది చాలా మంది చూసే ఉండవచ్చు. 

 

ఉదాహరణకి, ప్రస్తుత సమాజానికి తెలిసి, అణు బాంబు, ఈ మధ్యన కనిపెట్టబడినది అనుకుంటారు. ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది, అణు బాంబు కనిపెట్టిన శాస్త్రవేత్తని మొదటిసారి ఆ బాంబు పేల్చాక, వెళ్ళి ఇదే మొదటి సారి కదా అని అడిగితే.... ఈ తరంలో ఇదే మొదటి సారి అన్నాడుట. మహాభారత యుధ్ధంలో అణు బాంబుల ప్రయోగం జరిగిందని విన్నాను... దానినే బ్రహ్మాస్త్రం అంటారేమో..

అలాగే, విమాన శాస్త్రం, టెలిఫోన్ కమ్యూనికేషన్స్, గణిత శాస్త్రం (పైథాగరస్ సిధ్ధాంతం వాడు కనిపెట్టడానికి కొన్ని వేల సంవత్సరాల పూర్వమే మన ఋషులకు తెలుసునని...) అనేక సాక్ష్యాలు దొరికాయి అని ఈ వీడియోలో చెప్పబడినది.

అంతేకాదు, అసలు ఆర్యులు ఇక్కడి వాళ్ళు కాదనీ, వాళ్ళు ఎక్కడి నుంచో మన దేశానికి వచ్చి మనకి సంస్కృతి నేర్పారనీ ఓ అబధ్ధపు సిధ్ధాంతం ఒకటి తెల్లవాడు ప్రాచుర్యం చేశాడు.. అది పచ్చి అబధ్ధమనీ, అసలు ప్రపంచం మొత్తానికి విద్యా,వైద్య, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలను బోధించినది మన భారతీయులేననీ, వైజ్ఞానికంగా నిరూపించబడినది అని తేల్చిచెప్పాడు ఈ వీడియోలో. ఇప్పుడు ఎవరైతే యూరపు వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానంలో ముందు ఉన్నారో, వాళ్ళు మన వేదాలని, పురాణేతిహాసాలనూ తీసుకువెళ్ళి, అధ్యయనం చేసి, వాటిని ఆధారంగానే వైజ్ఞానిక ప్రగతి సాధించారనీ చెప్పాడు. 

మన వేద మంత్రాలు ఎంత పవిత్రమైనవో, మంత్ర జపం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో... అది కూడా సాంకేతికముగా నిరూపించారు. ఇప్పుడు మన గూగుల్ సెర్చ్ ఇంజన్ లో ఏది కావాలంటే అది వెతుక్కోవడం అనే దానికోసం వాళ్ళు ఉపయోగించే అల్గోరిథమ్ మన ఋగ్వేదంలో చెప్పబడినది అని, మన ఊహకి అందని గణిత శాస్త్ర రహస్యాలు మన వేదాలలో దాగి ఉన్నాయి అని, ఇలా అనేక విషయాలు చెప్పారు.. చాలా బాగుంది అందరూ ఒకసారి చూడగలరు.






ఇక రెండవ వీడియోలో, మన సంకల్పములో చెప్పే భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిక్భాగే అని చెప్పబడే విషయాన్ని, అందమైన గ్రాఫిక్స్ లో చూపించారు.. అసలు ఈ సకల విశ్వంలో మన భూమి ఎంత చిన్నదో, సూర్యుడి గమనాలు ఎలా ఉంటాయో, మనకి ఉత్తరాయణం, దక్షిణాయనం ఎలా వస్తాయో, సూర్య భగవానుడు ఏక చక్ర రథంపై ఎలా పయనిస్తాడో, అద్భుతంగా చిత్రీకరించారు.. ఇప్పుడు మనవాళ్ళు కనిపెట్టిన GPS (Global Positioning System)  అవీ ఏమీ లేనప్పుడు కూడా, మనవాళ్ళు నక్షత్ర మండలాలనూ, పాలపుంతలనూ, ఈ విశ్వం ఎక్కడి వరకూ వ్యాపించి ఉండవచ్చూ, గ్రహముల కదలిక బట్టి మన జీవితం ఎలా ప్రభావితం అవుతున్నదీ,, యథా తథంగా లెక్కకట్టారు మన ఋషులు. అసలు ఇక్కడ భూమి మీద కూర్చుని, సూర్య భగవానుడి పయనం గురించి, ఆయన ఏక చక్ర రథంతో నడుస్తాడనీ, అంగారకుడు లేక కుజ గ్రహం ఎలా ఉంటుందీ, అన్నిటికంటే పెద్ద గ్రహం కాబట్టి బృహస్పతి అనీ ఇలా నామకరణం కూడా ఎలా చేయగలిగారో, "సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం" అని పురుష సూక్తం లో చెప్పినట్లుగా, భూమి గుండ్రముగా ఉంటుంది అనీ.... ఎన్నో విషయాలు మన ఋషులు ఇక్కడ కూర్చుని యోగ మార్గములో దర్శించి, మనకి ఏది మంచిదో, ఎలా బ్రతకాలో చెప్పారు....


                            

ఇవన్నీ తలచుకుంటే, నాకు ఏదో లోకంలో ఉన్నట్లుగా ఉంది, ఏమి మన సనాతన ధర్మము, ఏమి మన ఋషులు,ఏమి మన వేదాలు, ఏమి మన వాగ్మయం...... ఏ పనీ చేయకుండా కూర్చుని చదివినా, ఈ జన్మ ఒక్కటి చాలదు.. అన్ని ఉన్నాయి మన శాస్త్రాలు, వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు. ఇక చదివేది ఎప్పుడూ, ఎప్పుడు ధ్యానం చేసేది, ఎప్పుడు మన ఋషులు చెప్పిన అద్భుతమైన విషయాలు దర్శించేదీ......... ఏమో ఎప్పటికి ఎన్ని జన్మలకి దర్శించగలమో అలా........

పెద్దలు మరిన్ని విషయాలు తెలిసినవి పంచుకోగలరని మనవి చేస్తున్నాను..


చివరిగా ఒక గమనిక, మన వేదాల గురించి, అంటే ఇవన్నీ ఎవడో పాశ్చాత్యుడు వచ్చి నిరూపిస్తేనే కానీ నమ్మవా, మనకి ఆ మాత్రం నమ్మకం లేదా !!..... అని అడిగితే ....ప్రస్తుతం మన జీవితం మనకి ఇష్టం ఉన్నా, లేకున్నా పాశ్చాత్యులు కనిపెట్టిన అనేక వస్తువులతో ముడి పడి ఉన్నది, ఉదాహరణకి, ఒక కొడుకో కూతురో అనుకున్న సమయానికి ఎంతసేపటికీ ఇంటికి రాకపోతే, ఒక వేళ ఆ కూతురు తనతో మొబైల్ ఫోన్ తీసుకువెళ్ళడం మరిచి పోతే, "ఏమీ కాదు, కూతురు క్షేమంగా వచ్చేస్
తుంది, నేను నమ్మిన ఈశ్వరుడు ఉన్నాడు" అని నిబ్బరంగా ఉండే వాళ్ళ కంటే, అదే మొబైల్ ఫొన్ కూతురు చేతిలో ఉండి, ఒక ఫోన్ చేసి కనుక్కున్నాక, ప్రశాంతంగా ఉండే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.. అంటే ఎన్ని తెలిసినా, చదివినా.... పూర్తి జ్ఞాన స్థాయిలోకి వెళ్ళడానికి సమయం పడుతుంది కదా.... అప్పటి వరకు మనకి మంచి విషయం ఎవరు చెప్పినా స్వీకరించాలి.

పొద్దున్న లేచిన దగ్గర నుంచి అనేక సనాతన ధర్మమునకు సంబంధించి వింటున్నాము, అనుష్టిస్తున్నాము, కానీ కొన్ని విషయాలు మనకి (ఇప్పటి తరంలో నాబోటి వాడికి), పాశ్చాత్యులలో ఉన్న కొద్ది మంది గొప్ప వ్యక్తులు మన వేదాల గురించి, ధర్మము గురించి చేసిన ప్రరిశోధన, వాళ్ళు చేసిన రీసెర్చ్ గురించి తెలుసుకోవడం కూడా అవసరమే.... ఉదాహరణకి, ఒక సారి బ్రహ్మశ్రీ సామవేదం వారు చిదంబర రహస్యం గురించి ప్రవచనం చెప్తూ అన్నారు, నటరాజ తత్వం గురించి, చిదంబర రహస్యం గురించి ప్రస్తుత తరంలో మనకి తెలుసున్న దాని కంటే, ఆంగ్లేయులు కొంత మంది చేసిన అపూర్వమైన పరిశోధన నుంచి మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. నేను కూడా ఆ పుస్తకం చదివి కొన్ని తెలుసుకున్నాను అని చెప్పారు. ఆంగ్లేయులు The Cosmic Dance of Shiva  అనే పేరున అనేక పుస్తకాలు వ్రాశారుట.

 అప్పుడు, మనకి మన పూర్వీకులు, ఋషులు ఇచ్చిన సంపద ఏమిటో, మన ఎంత విలువైన సాంప్రదాయానికి వారసులమో తెలుసుకుని, మన ధర్మం పైన మరింత పూనిక పెంచుకోవడం కోసమే కానీ, ఏదో శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్లుగా మళ్ళీ మన శాస్త్రాల గురించి కూడా తెల్లవాడు చెప్తేనే నమ్మాలా అని అనకోవద్దు. కాకపోతే ఇలా తెలుసుకోవడం అనేది, ఇక్కడితో ఆగకుండా, మన తరంలో, దీని పైన మరింత దృష్టి సారించి, మరిన్న అద్భుతమైన విషయాలు మన సాధన ద్వారానో, పరిశోధనల ద్వారానో, పెద్దలు, ఋషి తుల్యులు అయిన వారి బోధల ద్వారానో, మనమందరమూ కూడా ఇంకా ఇంకా తెలుసుకుని మన భావి తరాల వారికి మనం ఎటువంటి విద్యకు వారసులమో తెలియజేయాలి... అని నా కోరిక.

మోహన్ కిషోర్ 
---
ఈ పోస్ట్ శ్రీ మోహన్ కిషోర్ గారు సత్సంగము గ్రూప్ లో పోస్ట్ చేసారు . ఇంత చక్కటి పోస్ట్ ను మీరు కూడా చూడాలని ఈ బ్లాగ్ లో పోస్ట్ చేశాను .  శ్రీ మోహన్ కిషోర్ గార్కి నా హృదయ పూర్వక ధన్యవాదములు . ఆయన బ్లాగ్ మీకు చాల ఉపయోగపడుతుంది.  http://shaktiputram.blogspot.in/